పట్నా : ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపధ్యంలో ప్రధాని టార్గెట్‌గా ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన అనుమానితులను అధర్ పర్వేజ్, మహ్మద్ జలాలుద్దీన్లుగా గుర్తించారు. వీరు ప్రధాని పర్యటనకు పదిహేను రోజుల ముందు పుల్వారి షరీఫ్‌లో శిక్షణ పొందినట్టు చెబుతున్నారు.
ప్రధాని మోదీ లక్ష్యంగా వీరు ఈనెల 6,7 తేదీల్లో సమావేశమై ఉగ్ర కుట్రకు పావులు కదిపారని సమాచారం. అనుమానిత ఉగ్రవాదుల పుల్వారి షరీఫ్ కార్యాలయంపై బిహార్ పోలీసులు దాడులు నిర్వహించగా పలు పత్రాలు, ఉగ్ర సాహిత్యాన్ని సీజ్ చేశారు. పట్నాలోని పుల్వారి షరీఫ్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయనే సమాచారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులుకు ఉప్పందించింది.
ఆపై జులై 11న ఆ ప్రాంతంలోని నయా టోలాలో దాడులు జరిపిన పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర కుట్రల్లో పాలుపంచుకునేందుకు శిక్షణ నిమిత్తం పలు రాష్ట్రాల నుంచి యువత ఇక్కడికి వస్తుంటారని పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి అరెస్టయిన ఉగ్రవాదులకు నిధులు వస్తుంటాయని పోలీసులు వెల్లడించారు.