Nitish Kumar : బీహార్ (Bihar) ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) కు తన రాజీనామా లేఖను అందించారు. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
అంతకంటే ముందు బీహార్ రాజధాని పట్నాలో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్డీయే శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిలీప్ జైస్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారీలతో సహా ఎన్డీయే కూటమిలోని 202 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు అందరూ ఆయనకు అనుకూలంగా ఓటువేశారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్ భవన్కు వెళ్లిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. తర్వాత ఎన్డీయే భాగస్వాముల మద్దతు లేఖను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
రేపు ఉదయం 11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 75 ఏళ్ల నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ సీఎం ప్రమాణస్వీకారోత్స కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఎన్డీయే భాగాస్వామ్య పార్టీల అధినేతలు హాజరుకానున్నారు.