Samrat Choudhary : బిహార్ నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. బుధవారం పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ సయ్యద్ అట హస్నైన్.. సామ్రాట్‌తో ప్రమాణం చేయించారు. ఇప్పటిదాకా సీఎంగా ఉన్న నితీష్ కుమార్ మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజ్యసభలో సభ్యత్వం పొందారు. ఇప్పుడు ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
బిహార్‌లో ప్రస్తుతం జేడీయూ, బీజేపీ, ఇతర పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఇంతకాలం జేడీయూ నుంచి నితీష్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించగా, ఇంతకాలం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి సీఎం పదవి చేపట్టారు. బీజేపీకి సీఎం పదవి దక్కడంతో జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. జేడీయూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌లు డిప్యూటీ సీఎంలుగా ఎన్నికయ్యారు. వీరికి క్యాబినెట్ మినిస్టర్లుగా హోదా దక్కుతుంది. బీజేపీ తరఫున బిహార్‌లో సీఎం పదవి చేపట్టడం ఇదే తొలిసారి. ఇంతవరకు రెండు దశాబ్దాల వరకు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉంది. కానీ, ఒక్కసారి కూడా బీజేపీకి సీఎం పదవి దక్కలేదు. తొలిసారి ఆ పార్టీ నుంచి సామ్రాట్ సీఎం పదవి చేపట్టి అరుదైన ఘనత దక్కించుకున్నారు.
సామ్రాట్. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే సామ్రాట్.. సెక్రటేరియట్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో సీఎం పదవిలో కొనసాగుతున్న 16వ బీజేపీ నేతగా సామ్రాట్ నిలిచారు. అంటే.. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో సీఎంలుగా బీజేపీ నేతలు కొనసాగుతున్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీజేపీ తరఫున సీఎం పదవి దక్కిన 19వ రాష్ట్రం బిహార్. బీజేపీ చరిత్రలో ఆ పార్టీ నుంచి సీఎం పదవి దక్కించుకున్న 57వ వ్యక్తి సామ్రాట్. గతంలో ఆర్జేడీలో ఉన్న ఆయన 2017లో బీజేపీలో చేరారు. బిహార్‌లో వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది.