పట్నా: ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు రేపుతూ కుల్లు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశవ్యాప్తంగా బీజేపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కుల, మతాల విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా బీహార్‌లో ఆర్జేడీ కీలక నేత తేజస్వియాదవ్ కులాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు నోరు పారేసుకున్నారు.
తేజస్వి యాదవ్‌ది అసలు యాదవ కులమే కాదని, ఆయన ఫేక్ యాదవ్ అని బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ నిఖిల్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ కుటుంబానికి గోవుల మందలు ఉన్నాయని, ఆయనే అసలైన యాదవని, శ్రీకష్ణుడి సంతితికి చెందినవాడని వ్యాఖ్యానించారు.
తేజస్వి యాదవ్ గొర్రెల మందలను మేపే సామాజికవర్గానికి చెందినవాడని, ఆయన అసలైన యాదవ్ కాదని తన నోటి దురుసును బయటపెట్టుకున్నారు. బీహార్‌కు చెందిన ఓ కేంద్రమంత్రి ముఖ్యమంత్రి అవుదామని కలలు కన్నాడని, కానీ బీహార్‌లో బీజేపీ ఆటలు సాగలేదని ఇటీవల ఒక ప్రెస్మీట్లో తేజస్వియాదవ్ వ్యాఖ్యానించారు.
అందుకు ప్రతిగా ఇప్పుడు బీజేపీ నేత నిఖిల్ ఆనంద్.. తేజస్వి కుల ప్రస్తావన తీసుకుస్తూ కించపర్చే వ్యాఖ్యలు చేశారు. నిఖిల్ ఆనంద్ నోటి దురుసు వ్యాఖ్యలపై బీహార్‌లో తీవ్ర దుమారం రేగుతున్నది. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని జనం మండిపడుతున్నారు.