న్యూఢిల్లీ : బీహార్లో అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections)ను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండనున్నది. ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ప్రపోజల్ ద్వారా ఓ మీడియా సంస్థ ఈ అంచనా వేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను అక్టోబర్ మొదటి వారంలో ఈసీ ప్రకటించనున్నది. ఛాత్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. అయితే ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా బీహార్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7వ తేదీల్లో చేపట్టారు. ఫలితాలను నవంబర్ 10వ తేదీన వెల్లడించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈవీఎంల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఉంచనున్నారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్ చోటులో మూడో వంతు అభ్యర్థి ముఖం కనిపిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీన బీహార్ ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. నామినేషన్ ఫైలింగ్ చివరి తేదీ నాటికి 18 ఏళ్లు నిండే ఓటర్లను కూడా జాబితాలో చేర్చనున్నారు.