Big Phython : సాధారణంగా పాముల్లో అనకొండ తర్వాత అతిపెద్ద పాములు కొండచిలువలే. ఈ కొండ చిలువలు ఎక్కువగా 5 నుంచి 8 అడుగుల పొడవుతో ఉంటాయి. బరువు దాని పొడవు, లావును బట్టి 10 నుంచి 50 కిలోల వరకు ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. నీరు, ఆహారం కోసం అడవి నుంచి పంటపొలాల్లోకి వచ్చిన భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు షాకయ్యారు.
హరిద్వార్ జిల్లా లక్సర్ తాలూకాలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామంలో కూలీలు పనులు చేస్తుండగా పంటపొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. దాంతో వాళ్లు భయంతో పరుగులు తీశారు. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆ కొండ చిలువను పట్టుకున్నారు.
ఆ కొండ చిలువ పరిమాణం చూసి అటవీ అధికారులు సైతం షాకయ్యారు. ఎందుకంటే దాని పొడవు 13 అడుగులు ఉండగా.. బరువు ఏకంగా 125 కిలోలు ఉంది. ఈ కొండచిలువను బంధించిన లక్సర్ అటవీ అధికారులు.. దాన్ని సమీప అడవిలో వదిలేశారు.