న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) అన్ని విభాగాలను రద్దు చేసింది. పీసీసీ చీఫ్‌తోపాటు జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కమిటీలను కూడా రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ రాష్ట్ర యూనిట్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలతో సహా మొత్తాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. పార్టీ నేతల తీరు వల్ల సొంత ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పార్టీని పూర్తిగా పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు 2019లో కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో అన్ని పార్టీ విభాగాలను కాంగ్రెస్ రద్దు చేసింది. అయితే
నాడు నియమించిన పీసీసీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ కొంత కాలం ఆ పదవిలో కొనసాగారు. 2022లో ప్రతిభా సింగ్ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేసులో కూడా ఆమె ఉన్నారు. అయితే సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సీఎం పదవి దక్కింది.
Hon’ble Congress President has approved the proposal to dissolve the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/xofu5vPRyy
— INC Sandesh (@INCSandesh) November 6, 2024