చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు దుష్యంత్ చౌతాలాకు మరో షాక్ ఎదురైంది. (Dushyant Chautala) ఆయన నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలలో నలుగురు పార్టీని వీడారు. ఎమ్మెల్యేలు ఈశ్వర్ సింగ్, రామ్‌కరణ్ కాలా, దేవేంద్ర బబ్లీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం ఆ పార్టీని వీడారు. బీజేపీలో లేదా కాంగ్రెస్ పార్టీలో వీరు చేరవచ్చని తెలుస్తున్నది.
కాగా, మరో ఇద్దరు జేజేపీ ఎమ్మెల్యేలు రామ్నివాస్ సుర్జాఖేరా, జోగి రామ్ సిహాగ్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వీరిపై అనర్హత వేటు వేయాలని జేజేపీ డిమాండ్ చేసింది. నార్నౌండ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాంకుమార్ గౌరమ్ కొంతకాలంగా పార్టీని వ్యతిరేకిస్తున్నారు.
మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, ఆయన తల్లి నైనా చౌతాలా, అమర్జిత్ ధండాల మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా మిగిలి ఉన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.