Big Blow | టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. అదే తరహాలో సైబర్ నేరాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. ఉన్నత విద్యావంతులను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూ సొత్తును అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. సైబర్ నేరగాళ్లకు షాక్ ఇచ్చింది. 7.81లక్షల ఫేక్ సిమ్‌కార్డులు, 83,668 వాట్సాప్ అకౌంట్లు, 3,962 స్కైప్ ఐడీలను బ్లాక్ చేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 28 వరకు ఈ చర్యలు తీసుకున్నట్లు లోక్‌సభకు కేంద్ర హోం వ్యవహారాలశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ఫేమ్ సిమ్‌కార్డులు, వాట్సాప్, స్కైప్ తదితర ప్లాట్‌ఫామ్స్‌ని ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారు. తమను తాము బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పరిచయం చేసుకొని వారిని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫేక్ ఐడీలతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ ఫేక్ మొబైల్ డివైజ్‌లను గుర్తించేందుకు నిబంధనలను కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే 2,08,469 మొబైల్ ఫోన్ల IMEI నంబర్లను బ్లాక్ చేసింది. IMEI నంబర్ ప్రతి ఫోన్ గుర్తింపు. ఈ నంబర్ ద్వారానే ట్రాక్ చేసుందుకు అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్ల మొబైల్స్‌ను సైతం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ అకౌంట్స్‌ని బ్లాక్ చేసింది. ఆయా అకౌంట్స్ సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంది. సైబర్ నేరాలను నివారించేందుకు కృషి చేస్తూ ఉంటుంది.
సైబర్ నేరాలను అడ్డుకునేదుకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1930ని ప్రారంభించిందని మీకు తెలుసా? మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతుంటే.. వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి. దాంతో పాటు cybercrime.gov.in పోర్టల్లోనూ ఫిర్యాదును కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఈ వ్యవస్థ సహాయంతో ఇప్పటివరకు రూ.4,386 కోట్లు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది.