అమృత్సర్: పంజాబ్‌లో (Punjab) గన్ కల్చర్‌పై (Gun Culture) ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 813 తుపాలకు సంబంధించిన లైసెన్సులను (Gun Licences) రద్దుచేసింది. దీంతో ఇప్పటివరకు రద్దుచేసిన లైసెన్సుల సంఖ్య 2 వేలకుపైగా చేరింది. తాజాగా లైసెన్సులను రద్దుచేసిన (Cancelled) వాటిలో ఎస్కేఎస్ కస్బా ప్రాంతంలోనే 235 తుపాకులు ఉన్నాయి. లూథియా రూరల్‌లో 87, షహీద్ భగత్‌సింగ్ నగర్లో 48, గుర్దాస్పూర్లో 10, ఫరీద్‌కోట్‌లో 84, పఠాన్‌కోట్‌లో 199, హోషియాపూర్‌లో 45, కపుర్తలాలో 6, సంగ్రూర్‌లో 16 తుపాకులు ఉన్నాయి.
వీటితోపాటు అమృత్సర్ కమిషనరేట్ పరిధిలోని 27 మంది, జలంధర్ కమిషనరేట్‌లో 11, ఇతర జిల్లాల్లో మరికొంత మందికి తుపాకీ వినియోగానికి ఇచ్చిన లైసెన్సులను క్యాన్సల్ చేసింది. అదేవిధంగా శుభకార్యాలు, మత సంబంధిత కార్యక్రమాలు, పెండ్లి వేడుకలు, మరే ఇతర వేడుకల్లోనైనా బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాగా, రాష్ట్రంలో మొత్తం 3,73,053 తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. గతేడాది ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసావాలా (Sidhu Moose Wala)ను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.