భోపాల్, మార్చి 9 : కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని బినా రైల్వే స్టేషన్లో ఈ-మెయిల్ బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. కామాయణి ఎక్స్‌ప్రెస్ రైలును ఖాళీ చేసి తనిఖీ చేసినప్పుడు అది బూటకపు ఈ-మెయిల్‌గా తేలింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లోని పోలీసులకు ఈ నకిలీ ఈ మెయిల్ బాంబు బెదిరింపులు ఓ తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఈ మెయిల్ బాంబు బెదిరింపులను గుర్తించే ‘ఏఐ టూల్’ను భోపాల్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఐపీ అడ్రస్ చెక్ చేయటం ద్వారా వచ్చింది నకిలీ ఈ మెయిల్ బాంబు బెదిరింపా? కాదా? అన్నది పరిశోధకులు తయారుచేసిన ఏఐ సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది.
దీంతో ఫేక్ ఈ మెయిల్స్‌ను త్వరగా గుర్తించవచ్చునని, తద్వారా ఘటనా స్థలంలో పోలీసులు గంటల కొద్దీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సిన పని తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘కృత్రిమ మేధ సాయంతో పరిశోధకులు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. బెదిరింపు ఈ మెయిల్లోని భాష శైలి, పదాల వాడకం, టైపింగ్ నమూనాలు, ఐపీ అడ్రస్‌లను ఏఐ టూల్ విశ్లేషించి చెబుతుంది. ఇతర పోలీస్ కేసుల శోధనలోనూ సహాయకారిగా ఉంటుంది’ అని ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ చెప్పారు.