లక్నో, జూలై 5: దైవాంశ సంభూతుడిగా చెప్పుకొని తిరుగుతున్న సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా గత రెండు దశాబ్దాల్లో రూ.100 కోట్ల ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తున్నది. ఇటీవల యూపీలోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న దర్యాప్తు సందర్భంగా అతడి సంపద వివరాలు బయటపడుతున్నాయి. తొక్కిసలాటలో 121 మంది చనిపోయినా అతడిపై భక్తులకు ఇంకా నమ్మకం సడలకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఉండే అతడి ‘ఫైవ్ స్టార్’ ఆశ్రమం ఒక ప్యాలెస్‌లాగా ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని రూ.4 కోట్ల విలువైన భూమిలో నిర్మించారు. అతడి సంరక్షకులు కొందరు ఈ భూమిని విరాళంగా ఇచ్చినట్టు సమాచారం. దాంతోపాటు 50 బిగాల భూమిని భోలే బాబా లీజుకు తీసుకున్నారు. అతడి ట్రస్టుకు కస్గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్లలో వందలాది బిగాల భూములున్నాయి.
భోలే బాబా తన భక్తుల పేరిట కొన్ని లగ్జరీ కార్లు కొన్నట్టు ఆరోపణలున్నాయి. ఆయనకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలున్నాయని సమాచారం. ఒక ఆశ్రమంలో విరాళాలు స్వీకరించమనే బోర్డు ఉంది. అయితే అందుకు భిన్నంగా అక్కడి గోడలపై ఆశ్రమానికి నగదు, భూములు, సిమెంట్, వాహనాలు దానం చేసిన దాతల పేర్లు కనిపించాయి.