భోపాల్, మే 15: దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల-కమల్ మౌలా వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల సముదాయాన్ని వాగ్దేవి సరస్వతి అమ్మవారికి అంకితం చేసిన ఆలయంగా హైకోర్టు ప్రకటించింది. అలాగే ఆ ప్రదేశంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) 2003లో చేసిన ఏర్పాటును కోర్టు కొట్టివేసింది.
ధార్‌ను సంస్కృత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దన ఘనత పొందిన సర్మార్ పాలకుడు రాజా భోజ్కు సంబంధించిన సరస్వతీ దేవాలయంగా ఈ స్మారక చిహ్నానికి చెందిన మతపరమైన స్వభావాన్ని చారిత్రక రికార్డులు, పురావస్తు సామగ్రి, సాహిత్య ఆధారాలు రుజువు చేస్తున్నాయని ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్మారక చిహ్నంపై హిందువుల వాదనను గుర్తిస్తూనే హైకోర్టు ఏకకాలంలో ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నించింది. దరఖాస్తు సమర్పించినట్లయితే ధార్ జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తగిన భూమిని కేటాయించే విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది.