న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా కరోనా మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నది. ఇప్పటికే భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఈ టీకాను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా శుక్రవారం ఢిల్లీలో వియత్నాం ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రి, ప్రొఫెసర్ డాక్టర్ త్రాన్ వాన్ తువాన్తో సమావేశమయ్యారు. వియత్నాంలో 18 ఏండ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకాలు ఇచ్చే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అదేవిధంగా భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను వియత్నాంలో నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా.. భారత్ బయోటెక్ గ్రూప్ జంతువుల కోసం వ్యాక్సిన్ కనిపెట్టేందుకు చేస్తున్న పరిశోధనపై వియత్నాం ఆరోగ్యశాఖ డిప్యూటీ మంత్రి ఆసక్తి కనబర్చినట్లు తెలిసింది.