న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారతదేశ వారసత్వ సంపదలు భగవద్గీత, భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రిజిస్టర్లో కొత్తగా చేర్చిన 74 డాక్యుమెంటరీ వారసత్వ సంపదలలో వైజ్ఞానిక విప్లవం, చరిత్రలో మహిళల పాత్ర, 72 దేశాలు, నాలుగు అంతర్జాతీయ సంస్థల బహుళ పక్ష అంశాలకు చెందిన ప్రధాన మైలురాళ్లు ఉన్నట్లు యునెస్కో తెలిపింది. రిజిస్టర్లో గ్రంథాలు, రాతప్రతులు, చిత్రపటాలు, ఫొటోలు, శబ్ద లేక వీడియో రికార్డింగులు మానవాళికి చెందిన వారసత్వ డాక్యుమెంటరీగా పొందుపరిచి ఉన్నాయి.
ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్ర గ్రంథాలు చోటు దక్కించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయునికి గర్వించే క్షణాలని చెప్పారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందని, ఈ రచనలు మనదేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులని మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయని తెలిపారు.
క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో భరత ముని రచించిన నాట్యశాస్త్రంలో మొత్తం 36,000 శ్లోకాలు ఉన్నాయి. గంధర్వ వేదగా పిలిచే ఈ శ్లోకాలు నాట్యశాస్త్ర సారాన్ని సంపూర్ణంగా తెలియచేస్తాయి. ఇక మహాభారత యుద్ధ రంగంలో హితులు, సోదరులు, గురువులు, బంధు జనులను చూసి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధను భగవద్గీతగా భారతీయులు విశ్వసిస్తారు. ఇందులో 18 అధ్యాయాలలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి.