Tutor Thrashes Student | విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఓ విద్యార్థి తలపై గాయమైంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివారు యెలహంకలో ఇటీవల చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడ్ని విజయ్ కుమార్ అని గుర్తించారు. ఆయనపై జువైనల్ జస్టిస్ యాక్ట్‌తోపాటు ఐపీసీలోని 324 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ నెల ఆరో తేదీ సాయంత్రం పదవ తరగతి విద్యార్థి.. విజయ్‌కుమార్ కోచింగ్ సెంటర్లో ట్యూషన్‌కు వెళ్లాడు. అతడ్ని విజయ్‌కుమార్ ఐరన్ పైపుతో కొట్టడంతో తలకు గాయమైంది. ఇంటికెళ్లిన తర్వాత తల్లి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై బలమైన గాయమైనా తమకు సమాచారం ఇవ్వలేదని విజయ్‌కుమార్‌పై కేసు పెట్టారు. సాయంత్రం 5.30 గంటలకు గాయమై రక్తం వస్తున్నా, రాత్రి 8.30 గంటల వరకు తన వద్దే అట్టి పెట్టుకున్నాడని ఆరోపించారు.
ఈ సంగతి తెలిసి, తాము ప్రశ్నించడానికి వెళితే.. విజయ్‌కుమార్ దుర్భాషలాడారని విద్యార్థి తల్లి వాపోయారు. తాను కావాలని ఎవరిని గాయ పర్చలేదని విజయ్‌కుమార్ చెప్పాడు. ట్యూషన్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఇండ్లకు వెళ్లి పోవాలని, కోచింగ్ సెంటర్ బయట నిలబడవద్దని అన్నాడు. కానీ తన సూచనలను విస్మరించి కొందరు బయటే తచ్చాడుతున్నారని తెలిపాడు. తాను ప్రశ్నిస్తే పొగరుగా సమాధానం చెప్పారన్నాడు. తాను ఇప్పటి వరకు బెదిరించానే కానీ, ఎప్పుడూ ఐరన్ రాడ్‌తో కొట్టలేదన్నాడు.