బెంగుళూరు: కర్నాటక ఎగ్జామినేషన్స్ అథారిటీకి చెందిన 8 మంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపుల్లో స్కామ్‌కు(Engineering Seat Blocking Scam) పాల్పడినట్లు తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. కేఈఏకు చెందిన అధికారులు నవంబర్ 13వ తేదీన మల్లేశ్వరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. అడ్మిషన్ల సమయంలో కొందరు సీట్లు బ్లాక్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2024-2025 సంవత్సరానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల సీట్లను బ్లాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే మూడు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన మేనేజ్మెంట్ను పోలీసులు ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం పోలీసులు ఆ విచారణ చేపట్టారు. ఆ తర్వాత 8 మందిని అరెస్టు చేశామని, దీంట్లో ఒక కేఈఏ ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కొందరు బ్రోకర్లు, ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బంది కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. కేఈఏ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద చీటింగ్, మోసం, ఐటీ యాక్టు నమోదు చేశారు. కాలేజీల్లో చేరాలన్న ఉద్దేశం లేని విద్యార్థులను సీట్లను బ్లాక్ చేసుకునేందుకు వాడుకున్నట్లు విచారణలో తేలింది.