బెంగళూరు, జనవరి 10: బెంగళూరులో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న నమ్మ మెట్రో(బెంగళూరు మెట్రో) పిల్లర్ కూలి తేజస్విని అనే మహిళ(30)తో పాటు రెండున్నరేండ్ల ఆమె కుమారుడు విహాన్ మృత్యువాత పడ్డారు. హెచ్బీఆర్ లేఅవుట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపైన ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కలిసి ద్విచక్రవాహనం మీద వెళ్తుండగా సుమారు 40 అడుగుల ఎత్తైన నిర్మాణంలో ఉన్న పిల్లర్ కూలింది.
పిల్లర్ ఇనుప చువ్వలు వారి మీద పడ్డటంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దవాఖానకి తరలించగా తల్లి, కుమారుడు చికిత్స పొందుతూ మరణించారు. భర్త లోహిత్, మరో కూతురు చికిత్స పొందుతున్నారు. చిన్నారులిద్దరు కవల పిల్లలు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
నాణ్యత లోపాల వల్లే
మెట్రో పిల్లర్ కూలిన ఘటనపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. 40 శాతం ప్రభుత్వం కమీషన్ వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కమీషన్ కారణంగా నాణ్యత ఉండటం లేదని విమర్శించారు. ఇప్పటివరకు రోడ్లపై గుంతల వల్ల బెంగళూరులో మరణాలు సంభవించాయని, ఇప్పుడు పిల్లర్లు కూలి సంభవిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు.