బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో వాహనం నడపాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతారు. నిత్యం గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తుంటారు. దీనిని విమర్శిస్తూ ఎన్నో ఫన్నీ స్టోరీలు వెలువడ్డాయి. అయితే ఒక వ్యక్తి మాత్రం బెంగళూరు ట్రాఫిక్ జామ్‌పై ప్రశంసలు కురిపించాడు. తన పెళ్లికి అదే కారణమని పేర్కొన్నాడు. ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఒక మహిళను చూసి ప్రేమలో పడినట్లు తెలిపాడు. మూడేళ్ల డేటింగ్ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తన భార్యను తొలిసారి సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద కలిసినట్లు తెలిపాడు. దీంతో తమ ఇద్దరి మధ్య మొదలైన పరిచయం తర్వాత స్నేహంగా మారిందని చెప్పాడు.
అయితే ఒక రోజు తన వాహనంపై ఆమెను ఇంటికి డ్రాప్ చేస్తుండగా ఎజిపురా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల భారీ ట్రాఫిక్ జామ్‌లో తాము చిక్కుకున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఒకవైపు ఆలస్యం, మరోవైపు ఆకలి వల్ల చిరాకు చెందిన తాము మరో మార్గంలో వెళ్లామని, ఈ సందర్భంగా కలిసి డిన్నర్ చేయడంతో ఇద్దరం ప్రేమలో పడినట్లు వివరించాడు. మూడేళ్ల డేటింగ్ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. ఇదంతా జరిగి ఐదేళ్లు అయ్యిందన్నాడు. అయితే తమ ఇద్దరినీ కలిపిన, ట్రాఫిక్ జామ్‌కు కారణమైన 2.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా కొనసాగుతుందంటూ విమర్శించాడు.
మరోవైపు రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. తాను బెంగళూరులో ఉన్నంత వరకు ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతూనే ఉంటుందని ఒకరు ఎద్దేవా చేశారు. పెళ్లి తర్వాత జీవితం గురించి మరో యూజర్ అడిగాడు. ‘వారు ఇప్పటికీ డేటింగ్ కోసం ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘పెళ్లి తర్వాత పరిస్థితులు మారుతాయి కదా!’ అని చమత్కరించాడు.