కోల్‌కతా: గన్స్, ఆయుధాలు కలిగిన పాకిస్థాన్ ఉగ్రవాదితో కలిసి ఉన్న ఫొటోను ఒక వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేశాడు. (Bengal man shares photos) దానికి ‘పాకిస్థానీ భయ్యా’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి గురించి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన వ్యక్తి ఫేస్బుక్లో కొన్ని ఫొటోలు అప్లోడ్ చేశాడు. ఏకే 47, ఇతర ఆయుధాలున్న వ్యక్తితో కలిసిన దిగిన ఫొటో కూడా అతడు పోస్ట్ చేశాడు. దానికి ‘పాకిస్థానీ భయ్యా’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
కాగా, ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దీనిని సీరియస్‌గా పరిగణించారు. బెంగాల్‌కు చెందిన ఆ వ్యక్తిని గుర్తించారు. మూడేళ్ల కిందట ఇంటిని వీడి ఉద్యోగం కోసం ఖతార్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఏడాది కిందట భారత్‌కు తిరిగి వచ్చాడని, అప్పుడు ఈద్ సందర్భంగా గ్రామంలో కనిపించినట్లు స్థానికులు చెప్పారు. ఆ తర్వత ముంబైకి వెళ్లి బంధువుల హోటల్లో ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు ఆ వ్యక్తి తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నించారు. మూడేళ్ల కిందట వివాహితురాలైన హిందూ మహిళతో కలిసి అతడు పారిపోయినట్లు వారు చెప్పారు. నాటి నుంచి కుమారుడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. దీంతో వారి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఆ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదితో కలిసి ఫొటో దిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడు? ఫొటోలో ఉన్న వ్యక్తితో అతడికి సంబంధం ఏమిటి? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.