బెంగాల్ సర్కార్ యోచన
కోల్‌కతా, మే 28: పశ్చిమబెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న సీఎం మమత ప్రభుత్వం అటువంటిదే మరో ఆలోచన చేస్తున్నది. గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ప్రైవేటు యూనివర్సిటీల తలుపులు కూడా మూసేయాలని యోచిస్తున్నది. ప్రైవేటు యూనివర్సిటీల్లో విజిటర్ హోదాలో ఉండే గవర్నర్‌ను ఆ కుర్చీ నుంచి కూడా తప్పించే ప్రక్రియ ప్రారంభమైందని అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆ స్థానాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసుతో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిందని తెలిపాయి.
ఈ మేరకు క్యాబినెట్ ప్రాథమికంగా అంగీకారం తెలిపిందని, తదుపరి మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నదని ఓ అధికారి తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీ ముందుకు బిల్లు రానున్నదని చెప్పారు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రణాళికలో కూడా ఉన్నదని తెలిపారు. చాన్స్‌లర్‌గా సీఎంను నియమించే బిల్లును గవర్నర్ ఆమోదించకుంటే ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేటు యూనివర్సిటీ విజటర్ హోదాలో గవర్నర్.. ఆయా వర్సిటీల స్నాతకోత్సవ కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా యూనివర్సిటీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం కోరే అధికారం కూడా ఉంటుంది. గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చాలా కాలం నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.