కోల్కతా: తాగుబోతులు వెంబడించి వేధించడంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు డ్యాన్సర్ ప్రయత్నించింది. ఆమె ప్రయాణించిన కారును వారు అడ్డగించి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది. (Drunk Men Chased Woman, Dies in Accident) పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుగ్లీ జిల్లాలోని చందర్నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సుచంద్ర చటోపాధ్యాయ, డ్యాన్సర్ కమ్ ఈవెంట్ మేనేజర్. ఆదివారం ఆమె తన బృందంతో కలిసి ఒక ప్రొగ్రామ్ కోసం బీహార్లోని గయకు కారులో బయలుదేరింది. రాత్రి 9.30 గంటల సమయంలో పనాగఢ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఇంధనం నింపుకున్నది.
కాగా, ఆ పెట్రోల్ బంకు వద్ద ఉన్న మరో కారులో ఐదుగురు వ్యక్తులున్నారు. మద్యం సేవించి ఉన్న వారు సుచంద్రను టీజ్ చేశారు. ఆమె వాహనం అక్కడి నుంచి బయలుదేరగా తమ కారులో వెంబడించారు. నిర్లక్ష్యగా డ్రైవ్ చేయడంతోపాటు ఆ మహిళ పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేశారు. రోడ్డు డివైడర్ వద్ద ఆమె కారును ఢీకొట్టి అడ్డుకున్నారు. దీంతో ఆ వాహనం బోల్తాపడింది. ముందు సీటులో కూర్చొన్న ఆ మహిళ తీవ్రంగా, మిగతా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించగా సుచంద్ర మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు సుచంద్రను టీజ్ చేసి వేధించిన వ్యక్తులు తమ కారు నుంచి దిగి పారిపోయారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యం సీసాలు, గ్లాసులు ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ కారు ఓనర్ను గుర్తించారు. పరారైన నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.