Language Issue | ముంబై, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మరాఠీలో జవాబు ఇవ్వనందుకు కేఎస్ఆర్టీసీ కండక్టర్‌పై దాడి జరగడం, కన్నడలో మాట్లాడలేదని మహారాష్ట్ర బస్ డ్రైవర్‌పై దాడి జరగడం ఇరు రాష్ర్టాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం కర్ణాటకలోని బెళగావి జిల్లా బలేకుంద్రి గ్రామం వద్ద కేఎస్ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ బాలిక(14) కండక్టర్ మహదేవతో ఉచిత టికెట్ విషయమై గొడవకు దిగింది. తనకు మరాఠీ రాదని, కన్నడలో మాట్లాడాలని కండక్టర్ ఆ బాలికను కోరారు. దానికి ఆ బాలిక మరాఠీ రాకపోతే ఎలా అంటూ కండక్టర్‌ను దూషించింది.
ఇంతలో హఠాత్తుగా పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలు కండక్టర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు బాలిక ఫిర్యాదు మేరకు మహదేవపై పోక్సో కేసును నమోదు చేశారు. శుక్రవారం రాత్రి బెళగావి సమీపంలో జరిగిన మరో ఘటనలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్ డ్రైవర్ ముఖంపై కొందరు నలుపు రంగు పూసి చితకబాదారు. ఆ డ్రైవర్ కన్నడలో మాట్లాడలేదని ఆగ్రహించిన కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు రాష్ర్టాల్లో సరిహద్దుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.