లక్నో: కొన్ని గంటల్లో పెళ్లి జరుగాల్సి ఉంది. ఊరేగింపుగా వెళ్తున్న వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు ముందు దూకి మరణించాడు. దీంతో పెళ్లికొడుకు ఇంట్లో విషాదం నెలకొన్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Groom Jumps In Front Of Train) ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాయ్‌బరేలీ జిల్లా సలోన్‌కు చెందిన 30 ఏళ్ల రవికి శుక్రవారం రాత్రి అజంగఢ్‌లో పెళ్లి జరుగాల్సి ఉన్నది. దీంతో తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి జరిగే ప్రాంతానికి బయలుదేరాడు.
కాగా, మార్గమధ్యలో గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బని రైల్వే స్టేషన్ సమీపంలో వరుడు రవి గూడ్స్ రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వరుడు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. పెళ్లి ఇష్టం లేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.