Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గం గుర్తుగా కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం ఎన్నికల్లో గడియారం గుర్తును ఉపయోగించకుండా నిషేధం విధించాలని శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. అయితే, ఎన్నికలు ముగిసే వరకు ఆదేశాలను ఉల్లంఘించబోని చెబుతూ నవంబర్ 6వ తేదీలోగా హామీపత్రాన్ని దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఉత్తర్వులను ఉల్లంఘించి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దని హెచ్చరించింది. అజిత్ వర్గం ఆదేశాలకు కట్టుబడి ఉండాలని.. పవార్ శరద్ పవార్ వర్గానికి నష్టం జరుగకుండా వ్యవహరించాలని చెప్పింది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టు పేర్కొంది.
తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నట్లు తేలితే సుమోటోగా ధిక్కార చర్యలు తీసుకుంటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ గుప్త, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం పేర్కొంది. శరద్ పవార్ వర్గం దాఖలు పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తును ఇచ్చిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని శరద్ పవార్ వర్గం సవాల్ చేసింది. అజిత్ పవార్ వర్గం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై అజిత్ వర్గానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది, పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కోరింది. మార్చి 19, ఏప్రిల్ 24 తేదీల్లో ఇచ్చిన సూచనల మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.