న్యూఢిల్లీ, మే 20: పన్నులు పెంచి, నిబంధనలు కఠినతరం చేస్తేనే బీడీ వినియోగం తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. జోధ్పూర్ ఎయిమ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధిపతి పంకజ్ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. బీడీ పరిశ్రమపై పన్నులు పెంచి, నిబంధనలు కఠినతరం చేయాలని అధ్యయనం సూచించింది. తద్వారా క్షయ, ఊపిరితిత్తుల వ్యాధులను నిర్మూలించవచ్చని పేర్కొంది. బీడీ పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న 20.6 శాతం పన్నులను భారీగా పెంచడం ద్వారా కుటీర పరిశ్రమ హోదా పోతుందని నివేదికలో పేర్కొన్నారు. పన్నుల పెంపు వల్ల ప్రభుత్వానికి పది రెట్లు ఆదాయం పెరుగుతుందన్నారు. ఏడాదికి సుమారు 50 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.