కాన్పూర్: వారంతా ఒకే కాలేజీలో చదువుతున్నారు. పుట్టిన రోజు పార్టీ (Birthday Party) అని పిలిచారు. బట్టలిప్పాలని బెదిరించారు.. దానికి వారు నో చెప్పడంతో కర్రలు, బెల్టులు, ఐరన్ రాడ్లతో ఇష్టం వచ్చినట్లు చావబాదిన ఘటన మధ్యప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. హెచ్బీటీయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు.. తమ జూనియర్లు అయిన థార్డ్ ఇయర్‌కు చెందిన ఓ విద్యార్థికి ఫోన్ చేశారు. బర్త్‌డే పార్టీ చేసుకుందామని, తనతోపాటు మరో స్టూడెంట్ను తీసుకుని అబ్దుల్ కలాం హాస్టల్‌కు రావాలని పిలిచారు.
దీంతో ఎంజాయ్ చేద్దామని అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరిని.. బట్టలు విప్పాలని సీనియర్లు అడిగారు. దానికి వారు నిరాకరించారు. ఫస్ట్ ఇయర్లో చేరగానే తమను ర్యాగింగ్ చేశారని, మళ్లీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగారు. దీంతో ఆగ్రహానికి లోనైన సీనియర్లు కట్టెలు, బెల్టులు, ఐరన్ రాడ్లుతో తమను విచక్షణా రహితంగా కొట్టారు. అయితే ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులపై ర్యాగింగ్, హత్యాయత్నం కింద కేసులు నమోదుచేశారు. నిందులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తామని డీసీపీ తెలిపారు. కాగా, హెచ్బీటీయూ యాజమాన్యం కూడా ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నది. అయితే సాధారణంగా ఫస్ట్ విద్యార్థులు ర్యాగింగ్‌కు గురవుతుంటారు. కానీ ఇక్కడ మూడో ఏడాది చదువుతున్న వారిని సీనియర్లు ర్యాగింగ్ చేయడం గమనార్హం.