న్యూఢిల్లీ, మే 8 : భారతీయ డిజిటల్ వ్యవస్థలపై సైబర్ దాడులు పెరగకుండా నిరోధించేందుకు తమ సైబర్ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆర్థిక సంస్థలు, ఇతర కీలక రంగాలకు కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ద్వారా భారత ప్రభుత్వం ప్రత్యేక సూచనలు జారీచేసింది. కేవలం ప్రభుత్వ వ్యవస్థలే కాక ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలు కూడా సైబర్ దాడుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు అత్యవసర చర్యలు చేపట్టాయి.
పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి తాము సైబర్ భద్రత విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి తెలిపారు. బ్యాంకులు, ఇతర కీలక రంగాలతోసహా ఆర్థిక రంగానికి చెందిన సంస్థలకు సెర్ట్ ఇన్ సూచనలు జారీచేసింది. మరింత విస్తృతంగా సంస్థలను అప్రమత్తం చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు నాస్కామ్ వంటి పరిశ్రమలకు చెందిన సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.