ఉదయ్‌పూర్: మెడికల్ బీడీఎస్ కోర్సు(Medical Student) చదువుతున్న విద్యార్థిని.. తన హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరిగింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన శ్వేతా సింగ్ అనే అమ్మాయి ఉదయ్‌పూర్‌లో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. శ్వేతా ఉరివేసుకున్నట్లు ఆమె రూమ్మేట్ గుర్తించింది. హాస్టల్ నిర్వాహకులు, పోలీసులు ఆ రూమ్‌కు చేరుకుని విచారణ మొదలుపెట్టారు.
రూమ్‌లో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. బోధనా సిబ్బంది మానసికంగా వేధిస్తున్నట్లు శ్వేత తన నోట్లో రాసింది. పరీక్షలను నిర్దేశిత సమయంలో నిర్వహించడం లేదని ఆమె ఆరోపించింది. శ్వేత ఆత్మహత్య ఘటన తర్వాత విద్యార్థులు కాలేజీలో నిరసన చేపట్టారు. రోడ్డును బ్లాక్ చేశారు. సూసైడ్ నోట్లో రాసిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కాలేజీ డైరెక్టర్ చర్చలు నిర్వహించారు. ఫ్యాకల్టీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చారు.
ఆత్మహత్య కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కాలేజీ యాజమాన్యం కూడా చర్యలు తీసుకోనున్నదని, ఆత్మహత్యకు కారణమైన సిబ్బందిని తొలగించనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. స్టూడెంట్ శ్వేత మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు సుఖేల్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో రవీంద్ర చరన్ తెలిపారు. కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు.