లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలిపై దాడి జరిగింది. వ్యాపార భాగస్వామి కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఘర్షణ నేపథ్యంలో ఆ నాయకురాలిని దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. (attack on SP woman leader) ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎస్పీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గార్గీ పటేల్, కాశీ విద్యాపీఠ్ బ్లాక్ మాజీ అధ్యక్షుడు ప్యారేలాల్ యాదవ్ మధ్య ప్రాపర్టీ డీలింగ్ వ్యాపారానికి సంబంధించిన భాగస్వామ్యమున్నది. ఈ నేపథ్యంలో వ్యాపార అంశంపై మాట్లాడేందుకు గార్గీ ఇంటికి ప్యారేలాల్ వెళ్లారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ప్యారేలాల్ భార్య, అతడి కుమారుడు, కుమార్తె ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్యారేలాల్ కుటుంబ సభ్యులు గార్గీపై దాడి చేశారు. ఆమె జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టారు. అక్కడున్న టేబుల్‌తో బాదారు. జోక్యం చేసుకోబోయిన గార్గీ కుమార్తె కూడా దాడి చేశారు.
మరోవైపు గార్గీ కుమార్తె సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. దాడిలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ నాయకురాలు గార్గీ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆమెపై దాడి చేసిన ప్యారేలాల్ కుటుంబానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఆధారాల కోసం గార్గీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.