న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఐదు రోజుల పనిదినాలు, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11న సమ్మె చేయనున్నట్టు బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. ఐదు రోజుల పని దినాలపై కొన్నేండ్లుగా ఉన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, పెన్షన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను నెరవేర్చాలనే డిమాండ్‌తో సమ్మె చేయాలని నిర్ణయించినట్టు యూఎఫ్‌బీయూ వెల్లడించింది. దీం తో వరుసగా బ్యాంకులకు నాలుగు రోజులపాటు సెలవు రానున్నది. సెప్టెంబర్ 11న ఉద్యోగుల సమ్మెతోపాటు ఆ మరుసటి రోజు రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం, సోమవారం వినాయక చవితి కావడంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనున్నది. దీంతోపాటు సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.