ముంబై: మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి తెరపైకివచ్చింది. బ్యాంకు లావాదేవీలన్నీ మరాఠీలోనే జరుగాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) డిమాండ్ చేసింది. (Bank transactions in Marathi) రాష్ట్ర అధికార భాషలోనే బ్యాంకు ట్రాన్సాక్షన్స్, కమ్యూనికేషన్స్ జరుగాలని అల్టిమేటమ్ జారీ చేసింది. మంగళవారం ఈ మేరకు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎంఎన్ఎస్కార్యకర్తలు ఎస్ బ్యాంకును సందర్శించారు. బ్యాంకు సిబ్బందికి పూలతోపాటు రాళ్లను అందజేశారు. బ్యాంకు లావాదేవీలను మరాఠీలో జరుపాలన్న డిమాండ్‌ను పూలతో, అలా జరుగని పక్షంలో తమ చర్య ఇలా ఉంటుందన్న వార్నింగ్‌ను రాయితో సింబాలిక్‌గా తెలియజేశారు. మిగతా జాతీయ, ప్రైవేట్ బ్యాంకులను కూడా వారు సందర్శించనున్నారు.
కాగా, ఎంఎన్ఎస్ ఇటీవల మరాఠీపై దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత రాజ్ ఠాక్రే ఇటీవల గుడి పడ్వా సందర్భంగా ప్రసంగించారు. అధికారిక వ్యవహారాల్లో మరాఠీని తప్పనిసరి చేయడంపై తన పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు. నాటి నుంచి ఆ పార్టీ కార్యకర్తలు మరాఠీ భాషపై ప్రధానంగా దృష్టిసారించారు. మరాఠీలో మాట్లాడలేకపోవడంపై ఒక సెక్యూరిటీ గార్డును తిట్టడంతోపాటు అతడి చెంపపై కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.