Changes | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నవేళ.. 1 జనవరి 2025 నుంచి కొత్త నిబంధనలు, కొత్త సదుపాయాలు అమల్లోకి రాబోతున్నాయి. అవేమిటో చూద్దాం..
ఫీచర్ ఫోన్లతో చెల్లింపులు : ఫీచర్ ఫోన్లలో ఇప్పటివరకు ఉన్న ‘యూపీఐ 123పే’ చెల్లింపుల పరిమితిని కేంద్రం పెంచింది. రూ.5 వేల నుంచి రూ.10వేలకు యూపీఐ 123పే ద్వారా లావాదేవీలు జరపవచ్చు.రైతు రుణాలు : ఎలాంటి గ్యారెంటీ చూపకుండా రూ.2లక్షల వరకు రైతులు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవచ్చునని ఆర్బీఐ తెలిపింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.
మూడు రకాల బ్యాంకు ఖాతాలు మూసివేత: మూడు రకాల బ్యాంకు ఖాతాలకు బ్యాంక్ సేవల్ని వెంటనే ఆపేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఎక్కువ కాలంపాటు ‘జీరో బ్యాలెన్స్’ కలిగివుంటే.. ఆ ఖాతాలను నిలిపివేయనున్నది. రెండేండ్లు అంతకన్నా ఎక్కువ కాలంపాటు లావాదేవీలూ లేని బ్యాంక్ ఖాతాల్ని కూడా నిలిపివేస్తున్నది. ‘ఇనాక్టివ్ అకౌంట్స్’గా నిర్ధారించిన బ్యాంక్ ఖాతాల్ని మూసివేసే అవకాశముందని తెలిపింది.
ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము : ఈపీఎఫ్వోలోని 7 కోట్ల సభ్యులకు కొత్త ఏడాదిలో కొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతున్నది. తమ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సొమ్మును ‘డెబిట్ కార్డు’ (ఏటీఎం)తో విత్డ్రా చేసుకోవచ్చునని కేంద్ర కార్మికశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ఎంతమేరకు అందుబాటులోకి వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. అలాగే సభ్యుల పెన్షన్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అదనంగా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఏ బ్యాంక్ నుంచైనా ఈపీఎఫ్వో పెన్షన్ను సభ్యులు పొందే సదుపాయం తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.