న్యూఢిల్లీ: ప్రఖ్యాత చిత్ర దర్శకుడు సత్యజిత్ రే(Satyajit Ray)కు చెందిన పూర్వీకుల ఇళ్లు బంగ్లాదేశ్లో ఉన్నది. అయితే ఆ ఇంటిని కూల్చేందుకు బంగ్లా ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఇప్పటికే కొంత వరకు కూల్చివేత ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఢాకాలోని మైమేన్సింగ్లో ఆ పురాతన ఇళ్లు ఉన్నది. సత్యజిత్ రే పూర్వీకుల ఇళ్లు కూల్చివేత అంశం ఆందోళనకరంగా ఉన్నట్లు భారత ప్రభుత్వం పేర్కొన్నది. కూల్చివేత నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని భారత్ కోరింది. సత్యజిత్ రే తాత, ప్రఖ్యాత సాహిత్యకారుడు ఉపేంద్ర కిషోర్ రే చౌదరీకి చెందిన ఇళ్లు డాకాలో ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి ఆ ప్రాపర్టీ ఇప్పుడు బంగ్లా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఆ బిల్డింగ్కు ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని, దాని కూల్చివేతను ఆపేస్తే బాగుంటుదని భారత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇండియా, బంగ్లా సంస్కృతికి చిహ్నంగా.. సాహిత్య మ్యూజియంగా ఆ నిర్మాణాన్ని చూడాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంలో సహకరించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తికరంగా ఉన్నట్లు తెలిపారు. సత్యజిత్ రే పూర్వీకుల ప్రాపర్టీని కూల్చివేసే ప్రక్రియ ఢాకాలో మొదలైనట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ ఆర్కియాలజీ శాఖ ప్రకారం ఆ ఇంటిని సుమారు వందేళ్ల క్రితమే నిర్మించారు. గత పదేళ్ల నుంచి ఆ ఇళ్లు నిర్మానుషంగా ఉంటోంది. శిశు అకాడమీ కార్యక్రమాలు ఓ కిరాయి ఇంటి నుంచి సాగుతున్నాయి. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.