ఢాకా: బంగ్లాదేశ్‌లో అరెస్టు అయిన చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి(Chinmoy Krishna Das) బెయిల్ పిటీషన్ వాయిదా పడింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు డిఫెన్స్ లాయర్ ఎవరు ముందుకు రాలేదు. దీంతో చిట్టగాంగ్ కోర్టు ఆయన బెయిల్ పిటీషన్‌పై విచారణను వచ్చే ఏడాది జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది. కోర్టు రూమ్‌కు ఉదయం 11 గంటలకు డిఫెన్స్ లాయర్ హాజరు కాలేదని, దీంతో బెయిల్‌ను వాయిదా వేస్తున్నట్లు చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సైఫుల్ ఇస్లామ్ ఆదేశాలు ఇచ్చారు.
కృష్ణదాస్ తరపున వాదించేందుకు సిద్దమైన లాయర్‌ను ఇస్లామిస్టులు చితకబాదినట్లు ఇస్కాన్ ఓ ప్రకనటలో తెలిపింది. ఆ లాయర్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లు పేర్కొన్నది. బెయిల్ విచారణకు హాజరు అవుతారన్న నేపథ్యంలో సుమారు 70 మంది హిందూ లాయర్లపై కేసులు పెట్టినట్లు బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగ్రన్ జోట్ తెలిపింది. కృష్ణదాస్‌ను డిఫెండ్ చేస్తున్న లాయర్లపై దాడి జరుగుతున్నట్లు ఆ సంస్థ ఆరోపించింది.
డిఫెన్స్ లాయర్ ఎవరూ హాజరుకాలేదని చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీసు అదనపు డిప్యూటీ కమీషనర్ మోఫిజుర్ రెహ్మాన్ మీడియాకు వెల్లడించారు. బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు ఆవరణలో సెక్యూర్టీని పెంచారు. కోర్టు సమీప ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు పెట్రోలింగ్ నిర్వహించాయి.