Bangladesh | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో కేంద్రం చొరవ తీసుకున్నది. అక్కడి హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో నివాసం ఉంటున్న భారతీయులు, హిందువులు, మైనారిటీల భద్రత, సౌకర్యాలకు సంబంధించి అక్కడి హోంమంత్రిత్వ శాఖ అధికారులతో ఈ కమిటీ చర్చలు జరుపనున్నది. భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రత, ప్రస్తుత పరిస్థితులను సైతం సమీక్షించనున్నది. బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈస్ట్ జోన్ ఏడీజీని కమిటీకి చైర్మన్‌గా నియమించారు. బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఐజీ, ఐజీ బీఎస్ఎఫ్ త్రిపుర, ఇండియన్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీకి చెందిన ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సభ్యుడు, సెక్రటరీ సభ్యులుగా ఉంటారు.
వాస్తవానికి ఇస్లామిక్ ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. సోమవారం మొదలైన దాడుల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాడుల భయంతోనే అనేక కుటుంబాలు మూకుమ్మడిగా వలస వెళ్లాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు భారత్‌లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని ఠాకూర్‌గావ్, పంచగఢ్ ప్రాంతాలకు వేలాది మంది హిందువులు చేరుకున్నారు. పలుచోట్ల ఇండ్లు, దుకాణాలతో పాటు దేవాలయాల్లోని విలువైన వస్తువులను సైతం దుండగులు దోచుకు వెళ్తున్నట్లు సమాచారం. అక్కడే ఉంటే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. అయితే, బంగ్లాదేశ్ బోర్డ్ గార్డ్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నా హిందూ కుటుంబాలు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా లేవని.. అయితే, భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు వీసాలు లేవని అలోఖవ సంఘ అధ్యక్షుడు మోజక్రుల్ ఆలం కొచ్చి తెలిపారు. ప్రస్తుతం సరిహద్దుల్లో 5వేల మంది వరకు ఉన్నట్లుగా చెప్పారు.