Hair Loss | ముంబై, జనవరి 8( నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలోని మూడు గ్రామాల ప్రజలను జుట్టు రాలిపోవడం కలవరపాటుకు గురి చేస్తున్నది. వారంలోనే వెంట్రుకలన్నీ రాలిపోయి బట్టతల వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ తాలూకాలోని బోండ్గావ్, కలవాడ్, హింగానా గ్రామాల్లో దాదాపు 50 మంది జుట్టు విపరీతంగా ఊడిపోతున్నది. చాలామందికి ముందుగా తలపై విపరీతంగా దురద వస్తున్నది. రెండోరోజు నుంచి వెంట్రుకలు కుప్పలుగా రాలిపోవడం ప్రారంభమై వారంలోనే బట్టతల వస్తున్నది. పురుషులతో పాటు మహిళలకూ ఈ సమస్య వస్తున్నది.
దీంతో బాధితులు దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. అయితే, వైద్యులకు కూడా ఒకేసారి ఇలా అసాధారణంగా జుట్టు ఊడిపోవడానికి కారణం అంతుబట్టడం లేదు. దీంతో బాధితుల నుంచి వెంట్రుకలు, చర్మ నమూనాలను వైద్యశాఖ సేకరించింది. గుర్తు తెలియని వైరస్ వల్లే ఇలా జరుగుతున్నదని గ్రామాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే, కలుషిత నీరే ఇందుకు కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నీళ్లలో పురుగుమందులు కలవడం వల్ల ఇలా జరుగుతున్నట్టు భావిస్తున్నరు. అధికారులు ఈ గ్రామాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.