న్యూఢిల్లీ, జూలై 29: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)లో ఆగస్టు 1 నుంచి పలు మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఇవి వినియోగదారులతోపాటు బ్యాంకులు, వ్యాపారులను ప్రభావితం చేయనున్నాయి. ఫలితంగా యూపీఐ వినియోగదారులు ప్రస్తుతం ఉన్నట్టు అపరిమితంగా కాకుండా రోజుకు 50 పర్యాయాలు మాత్రమే తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే వీలుంటుంది. యూపీఐ ఆటోపే లావాదేవీలకు ఎన్పీసీఐ నిర్ణీత టైమ్ స్లాట్లను నిర్ణయించడంతో సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐలు, వినిమయ బిల్లులు లాంటి చెల్లింపులను ఇకపై పగటిపూట ర్యాండమ్‌గా కాకుండా నిర్ణీత సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేస్తారు. ఈ మార్పు వల్ల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావమేమీ ఉండదు. ఎందుకంటే వారి ఆటో-పేమెంట్లు యథావిధిగా పనిచేస్తాయి. కానీ, వ్యాపారులు మాత్రం తమ పేమెంట్ కలెక్షన్ షెడ్యూళ్లను నిర్దేశిత టైమ్ స్లాట్లకు అనుగుణంగా తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐని మరింత ఆధారపడదగినదిగా, ప్రత్యేకించి రద్దీ సమయాల్లో అంతరాయాలకు తావులేకుండా లావాదేవీలు సజావుగా సాగేలా తీర్చిదిద్దడం ఈ మార్పుల లక్ష్యం.