బెంగళూరు, మార్చి 30: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శల దాడికి దిగుతున్నారు. మహిళలను ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజల ముందు కనీసం మాట్లాడే సత్తా లేదు. ఆమె వంటింటికి మాత్రమే సరిపోతారు’ అంటూ దేవనగరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని గాయత్రి సిద్ధేశ్వరను కించపరుస్తూ శివశంకరప్ప వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదు, వంటింటిలో పనిచేయడానికి సరిపోతారు..అంటూ వెక్కిరించారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. 92 ఏండ్ల శివశంకరప్ప హస్తం పార్టీలో అత్యంత వృద్ధ నేత. ప్రస్తుతం ఆయన దేవనగిరి దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
చాలా బాధాకరం : సైనా నెహ్వాల్
శివశంకరప్ప వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళలు వంట గదికే పరిమితం అవ్వాలంట-కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలివి. మహిళలు పలు రంగాల్లో కలలు కంటున్నప్పుడు ఎందుకు కించపరుస్తున్నారు. స్త్రీద్వేష వ్యక్తుల నుంచి మహిళలకు అవమానం జరుగుతున్నది. ఇది నిజంగా చాలా బాధాకరం’ అని సైనా రాసుకొచ్చారు.