ముంబై, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య కమిటీని నియమించింది. చిన్నారుల పరిస్థితిని పరిశీలించగా 15 రోజుల్లో వారిపై పలుమార్లు లైంగిక వేధింపులు జరిగి ఉండొచ్చని ఈ కమిటీ అనుమానిస్తున్నది. ఈ మేరకు కమిటీ ప్రాథమిక నివేదికను ఉటంకిస్తూ ఓ మీడియా సంస్థ పేర్కొన్నది. కాగా, ఘటన జరిగిన పాఠశాల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పాఠశాల ప్రాంగణంలో సీసీటీవీ పర్యవేక్షణ సరిగ్గా లేదని కమిటీ గుర్తించింది. నిందితుడు ఇంతకుముందు కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఉండవచ్చని కమిటీ భావిస్తున్నది.
మహావికాస్ అఘాడీ శనివారం చేపట్టాలనుకున్న మహారాష్ట్ర బంద్ చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత, బంద్‌ను ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ శరద్చంద్ర పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపుకు కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే సానుకూలంగా స్పందించారు. బంద్‌ను విరమించి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య శాంతియుతంగా నిరసన చేపట్టాలని ఈ పార్టీలు నిర్ణయించాయి. ఈ ఉద్యమం అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్నదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.