Punjab Stalwarts Defeat | అంచనాలకు అనుగుణంగా పంజాబ్‌లో రాజకీయ ముఖచిత్రం మారిపోవడమే కాదు.. ఆ మార్పుకు కొత్త నిర్వచనం ఇచ్చాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్లను గెలుచుకోవడానికే పరిమితం కాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో నేతల కంచుకోటలను బద్ధలు కొట్టింది. కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీలను చీపురు తుడిచిపెట్టేసింది. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 45 వేల మెజారిటీతో విజయం సాధించారు. ధురి నుంచి అధికార కాంగ్రెస్ అభ్యర్థి దల్బీర్ గోల్డీపై ఘన విజయం నమోదు చేశారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు సీట్లలోనూ ఓడిపోయారు.
మాజీ సీఎం అమరిందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా ఆప్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. 30 ఏండ్లలో తొలిసారి అసెంబ్లీకి బాదల్ కుటుంబ సభ్యులు ఎన్నికవ్వలేదు. 117 స్థానాలకు కాంగ్రెస్ 18 స్థానాలతో సరిపెట్టుకోగా, ఆప్ 92 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. అకాలీదళ్ కూటమి మూడు, బీజేపీ కూటమి, ఇతరులు చెరో రెండు స్థానాలకు పరిమితం అయ్యాయి.
పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తన కంచుకోటగా భావిస్తున్న అమృత్‌సర్‌లో జీవన్‌జోత్ ఔర్ (ఆప్) చేతిలో ఓటమి పాలయ్యారు. పాటియాలా సిటీలో కెప్టెన్ అమరిందర్ సింగ్ (పంజాబ్ లోక్ కాంగ్రెస్), తన ప్రత్యర్థి అజిత్ పాల్ కోహ్లీ (ఆప్) చేతిలో పరాజయం పాలయ్యారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఆప్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
జలాలాబాద్‌లో అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్.. తన ప్రత్యర్థి జగ్దీప్ కంబోజ్ (ఆప్), బిక్రం మాజిథియా (అకాలీదళ్), జీవన్‌జోత్ కౌర్ (ఆప్), సోనూసూద్ సోదరి మాల్వికా సూద్ (మొగా-కాంగ్రెస్).. తన ఆప్ ప్రత్యర్థి అమన్‌దీప్ కౌర్ అరోరా, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (లొంగ్)లో గుర్మీత్‌సింగ్ కుడియన్ (ఆప్) చేతిలో ఓటమి పాలయ్యారు.