బెంగళూరు: ‘బాబోయ్ బెంగళూరు రోడ్లు.. వీటిపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే. అయితే మాకు కావాల్సింది రోజువారీ సాహసం కాదు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు. గోతులు నిండిన ఈ రోడ్లు, తీవ్రంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లో మేము స్కూల్‌కు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధ్వానమైన రోడ్ల కారణంగా ఐదు కి.మీ దూరం రావడానికి గంటన్నర సమయం పడుతున్నది.
ఇకనైనా మీరు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అంటూ కొంతమంది పాఠశాల విద్యార్థులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్‌కు లేఖలు రాశారు. సుమారు వంద మంది విద్యార్థులు తమ లేఖల ద్వారా ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. మహాదేవపుర అసెంబ్లీ పరిధిలోని కార్మెల్హారం, గుంజూర్పాళ్య, చిక్కబెల్లండూ ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు లేఖా ఉద్యమాన్ని చేపట్టారు.