అయోధ్య, జనవరి 7: అయోధ్య రామాలయ ప్రాంగణంలో కళ్లద్దాల కెమెరాలతో ఫొటోలు తీసిన గుజరాత్ యువకుడిని గుడి భద్రతా సిబ్బంది సోమవారం అదుపులోనికి తీసుకున్నారు. మంగళవారం ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అయోధ్య ఆలయంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిషేధం. ఈ నిబంధనను వడోదరకు చెందిన వ్యాపారి జాని జైకుమార్ ఉల్లంఘించాడు.
అతడు చాలా తనిఖీ పాయింట్లను దాటుకొని ఆలయ సింహ ద్వారం వద్ద ఫొటోలు తీస్తుండగా ఎస్ఎస్ఎఫ్ జవాన్ కెమెరా ఫ్లాష్‌ను గమనించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాడు. కళ్లద్దాలకు రెండు వైపులా కెమెరాలున్నాయని, ఫొటోలు తీయడానికి కళ్లద్దాలపై ఒక బటన్ ఉందని ఎస్పీ(సెక్యూరిటీ) బలరామ్చారి వెల్లడించారు.