అయోధ్య: అయోధ్య రామాలయం సీఈవోగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా(Jeetendra Mishra) నియమితులైన విషయం తెలిసిందే. అయితే రామభక్తుల మద్దతు, దీవెనలు తమకు ముఖ్యమని ఆయన అన్నారు. రామ ట్రస్టు వ్యూహాలు త్వరలో ఆచరణలోకి రానున్నట్లు ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యులతో మీటింగ్ నిర్వహించిన తర్వాత ఇవాళ జితేంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడారు. భక్తుల విశ్వాసం, దీవెనలు తమ పట్ల ఉండాలని ఆశిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. రామభక్తుల ఆశీస్సులు తమకు ముఖ్యమన్నారు. మీ దీనవలు, నమ్మకంతోనే మేం ముందుకు వెళ్తామని, నాకు కొంత సమయం ఇవ్వండి అంటూ మిశ్రా అన్నారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారం మిశ్రాను తొలి సీఈవోగా నియమించిన విషయం తెలిసిందే. అయితే అయోధ్య రామాలయ వ్యవహార శైలిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల్లో తమ వ్యూహాలు అమలులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. వివిధ బృందాల సహాకారంతో ఆయోధ్య ఆలయంలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కీలకమైన నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. తనకు సీఈవో బాధ్యతలు అప్పగించిన శ్రీరాముడికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ట్రస్టు జనరల్ సెక్రటరీ గోవింద దేవ్ గిరి సమక్షంలో వైదేహి భవన్లో మీటింగ్ నిర్వహించారు. ట్రస్టు మార్గదర్శకాలతోనే భవిష్యత్తు వ్యూహాలను రచించనున్నట్లు చెప్పారు. రామాలయ సెక్రటరీగా గిరి, ట్రెజరర్‌గా మహేశ్ భాగ్చంద్కా నియమితులయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు జీతేంద్ర మిశ్రా హెడ్‌గా ఉన్న విషయం తెలిసిందే.