Ayodhya Ram Mandir | అయోధ్యలో రామ మందిరం మొదటి దశ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. మూడు దశల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మొదటి దశ పూర్తయిన తర్వాత భక్తులకు ఆలయంలో దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్లోగా మొదటి దశ పనులు పూర్తి చేయాలని ట్రస్ట్ నిర్ణయించిందని, ఐదు మండపాల నిర్మాణంలో దాదాపు 160 స్తంభాలను వినియోగించామన్నారు. విద్యుత్ ఇతర ఏర్పాట్లన్నీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని చెప్పారు.
వచ్చే ఏడాది డిసెంబర్ 30 నాటికి మొదటి, రెండో అంతస్తుల పార్కోట (అవుటర్ ప్రహరీ) పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేసి భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అయితే, ఆలయం మొత్తం నిర్మాణం ఎప్పటికి సిద్ధమవుతుందన్న ప్రశ్నకు 2025 డిసెంబర్ నాటికి సిద్ధం చేస్తామని నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి రూ.1400 కోట్ల నుంచి రూ.1800 కోట్ల వరకు ఖర్చు కానుండగా.. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతున్నట్లు వివరించారు.