న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ సంస్థ ఎగ్జిట్‌పోల్ ఫలితాలను వెల్లడించదని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా మీడియాతో మాట్లాడారు. డాటా నాణ్యత, ప్రతిస్పందన పంపిణీ, గణాంక విశ్వాస స్థాయిలపై వివరణాత్మక అంతర్గత సమీక్ష నిర్వహించిన తర్వాత ఎగ్జిట్‌పోల్ ఫలితాలను విడుదల చేయరాదని నిర్ణయించామని గుప్తా తెలిపారు.
తాము ఎవరికి ఓటు వేశామనే విషయాన్ని చెప్పకుండా మౌనం వహించడానికే ఓటర్లు మొగ్గుచూపారని ఆయన చెప్పారు. 16 క్షేత్రస్థాయి వ్యక్తిగత యూనిట్లతో 80 మంది శిక్షణ పొందిన సర్వేయర్లుతో ప్రామాణీకరించిన ఎగ్జిట్‌పోల్స్ విధానాలను అవలంబించి 13,250 మంది పౌరుల నుంచి శాంపిల్స్ సేకరించినట్టు తెలిపారు.
అయితే తాము వివరాలు సేకరించడానికి ప్రయత్నించిన 70 శాతం మంది సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారని తెలిపారు. వారిలో చాలామంది మౌనంగా ఉండటానికే ఇష్టపడ్డారన్నారు. ఈ క్రమంలో సేకరించిన డాటా విడుదల చేసినా, అది ఓటర్ల వాస్తవిక అభిప్రాయాలను ప్రతిబింబించే అవకాశం లేదని భావించి ఫలితాలను నిలిపివేసినట్టు గుప్తా తెలిపారు.