చెన్నై: తమిళనాడు శాసససభ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే గెలుస్తుందని తాము అంచనా వేస్తే రాజకీయ పండితులు, పరిశీలకులు, ఇతర పోలింగ్ ఏజెన్సీల నిర్వాహకులు తమను చూసి నవ్వారని.. కానీ ఇప్పుడు తాము చెప్పిందే నిజమైందని యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా అన్నారు. ఎన్నికల ఫలితాలపై సోమవారం ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక్కటే టీవీకే 98-120 సీట్లు గెలవొచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది. ‘దేశమంతటా మేం చెప్పింది నమ్మలేదు. కానీ ఇది డాటా సైన్స్ సాధించిన విజయం. మిగతా వాళ్లకి, మాకు తేడా ఏంటంటే మేం అన్ని స్థానాల్లో అన్ని వేళల్లోనూ ఓటర్ల నాడి తెలుసుకొంటాం’ అని ప్రదీప్ అన్నారు. టీవీకేకు వచ్చిన ఓట్ల శాతం కూడా తమ అంచనాలతో సరిపోయిందని ఆయన తెలిపారు.
యువతరం జై కొట్టడమే కారణం
యువతరం టీవీకేకు ఎక్కువగా ఓటేయడంతో ఆ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించగలిగిందని ప్రదీప్ విశ్లేషించారు. 18-39 వయసున్న ఓటర్లు ఎక్కువ మంది టీవీకేకు ఓటేశారని ఆయన తెలిపారు. ఈ వయస్కులు మొత్తం ఓటర్లలో 42 శాతమని తెలిపారు. 40 ఏండ్ల పైబడిన ఓటర్లలో 25-30 శాతం విజయ్‌కు మద్దతు పలికారని చెప్పారు.