న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీ విమానాశ్రయానికి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో నవంబర్ 7న విమాన సర్వీసులు తీవ్ర ఆలస్యాన్ని ఎదుర్కొన్న ఘటనను మరువక ముందే దేశవ్యాప్తంగా మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. అనేక విమానాశ్రయాలలో మరో సాంకేతిక సమస్య కారణంగా మంగళవారం విమాన సర్వీసులలో తీవ్ర జాప్యం ఏర్పడింది. థర్డ్ పార్టీ సిస్టమ్ అంతరాయం కారణంగా అనేక విమానాశ్రయాలలో చెక్-ఇన్ కార్యకలాపాలకు అవరోధం ఏర్పడి పలు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన సర్వీసులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని ఎయిరిండియా మంగళవారం ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది.
పరిస్థితి పూర్తిగా చక్కదిద్దుకునే వరకు తమ విమాన సర్వీసులు ఆలస్యం అవుతాయని ఎయిరిండియా ఎక్స్ పోస్టులో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌లైన్స్ తమ చెక్-ఇన్, ఆపరేషనల్ సిస్టమ్స్ కోసం థర్డ్ పార్టీ సర్వీసు ప్రొవైడర్లపై ఆధారపడతుంటాయి. ఇటువంటి సిస్టమ్ అంతరాయాల విమాన రాకపోకలలో తీవ్ర జాప్యం జరుగుతుంటుంది. ఇండిగో సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడగా, నిర్వహణ సమస్యలే అందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా పలు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడగా, ఇందుకు జీపీఎస్ స్పూఫింగ్ కారణమని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జీపీఎస్ స్పూఫింగ్ నిజమేనంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.