డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం విరిగిపడింది. (Uttarakhand Avalanche) మంచు చరియల కింద సుమారు 50 మందికిపైగా కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పది మంది కార్మికులను రక్షించారు. చమోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం బద్రీనాథ్ ధామ్‌కు 3 కిలోమీటర్ల దూరంలోని మానా గ్రామంలో భారీగా హిమపాతం దూసుకువచ్చింది. రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన సుమారు 57 మంది కార్మికులు మంచుచరియల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), జిల్లా యంత్రాంగం, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ), సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్వో) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. మంచు గడ్డల కింద చిక్కుకున్న పది మంది కార్మికులను వెలికి తీసి రక్షించారు. మిగతా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి వరకు సుమారు 20 సెంటీ మీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, అండర్‌పాస్‌లు మునిగిపోయే అవకాశమున్నదని హెచ్చరించింది.