Writer Ratan Sharda | న్యూఢిల్లీ, జూలై 24: బీజేపీ ఐటీ విభాగం వైఖరి, దాని అధ్యక్షుడు అమిత్ మాలవీయ తీరుపై రచయిత రతన్ శార్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ట్రోల్ చేస్తున్న బీజేపీ ఐటీ సెల్ వైఖరి తీవ్ర సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆస్తుల అమ్మకాలపై ఇండెక్సేషన్ తొలగిస్తూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ.. ‘ఈ రాత్రికి ప్రతిఒక్కరూ ఇండెక్సేషన్ నిపుణులే’ అంటూ ఎద్దేవా చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేశారు. ఈ పోస్ట్‌పై రతన్ శార్ద స్పందించారు. ‘బీజేపీ ఐటీ విభాగం వైఖరితో తీవ్ర సమస్య ఉంటుంది. బడ్జెట్లోని మంచి అంశాలను సులువైన పద్ధతిలో చెప్పడానికి బదులు ప్రజలనే ట్రోల్ చేస్తున్నారు. ప్రజల భయాలకు సమాధానం ఇవ్వండి. వారిని అవమానించకండి’ అంటూ రతన్ శార్ద పోస్ట్ చేశారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ రచయితగా రతన్ శార్దకు పేరుంది. ‘కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్: ది ఆర్ఎస్ఎస్ వే’, ‘ఆర్ఎస్ఎస్ ఫ్రమ్ యాన్ ఆర్గనైజేషన్ టు ఏ మూవ్మెంట్’ వంటి అనేక పుస్తకాలను ఆయన ఆర్ఎస్ఎస్పై రాశారు. తాను ఆర్ఎస్ఎస్కు జీవితకాల సభ్యుడిగా ఆయన చెప్పుకుంటారు. ఇంతకుముందు కూడా ఆయన బీజేపీ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ ఆయన ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’లో గతంలో ఒక వ్యాసం రాశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తాకిన ఎదురుదెబ్బను ఉద్దేశించి కూడా ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలు అతివిశ్వాసంతో ఉన్న అనేకమంది బీజేపీ నేతలు, కార్యకర్తలకు వాస్తవ పరిస్థితులు తెలిసేలా చేశాయని పేర్కొన్నారు.